ఉల్లి.. దిగిరావే తల్లీ!
ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కొండెక్కి కూర్చొని దిగిరానంటోంది. దీని ధర రోజురోజుకు పరుగులు తీస్తోంది. బహిరంగ మార్కెట్‌లో సెంచరీ కొట్టేసింది. ఫలితంగా నగరవాసికి కూరలో ఉల్లిగడ్డ కరువైంది. నగరానికి డిమాండ్‌కుసరిపడా దిగుమతి లేకపోవడంతో ధర అమాంతం పెరిగింది. కొంతఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీపై కిలో రూ.40కి విక్రయిస్తోంది. అయితే ఆయా కౌంటర్లకూ డిమాండ్‌కు సరిపడా దిగుమతి లేదు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గడమేఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
సాక్షి,సిటీబ్యూరో/చాదర్‌ఘాట్: కూరల్లో వాడే ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది.కొందామంటే కొండెక్కి కూర్చొంది. బంగారం ధర తరహాలో ఉల్లి ధర పరుగులు తీస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో ధర వంద రూపాయలకు చేరువైంది. ఉల్లి నాణ్యతను బట్టి ధర మరింత ఎగబాగుతోంది. సోమవారం మార్కెట్‌లో హోల్‌సేల్ కొత్త ఉల్లి ధర కిలో రూ. 85 పలికింది. మార్కెటింగ్ శాఖ రైతు బజార్ల ద్వారా ఒక్కొక్కరికి కిలో చొప్పున సబ్సిడీపై కిలో రూ.40 చొప్పున పంపిణీ చేస్తోంది. దీనికోసం కనీసం మూడు గంటలకు పైగా లైన్లో నించోవాల్సి వస్తోంది. అప్పుడైనా దొరుకుతుందా? అంటే అనుమానమే. అది కూడా నాసిరకం ఉండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఉల్లి ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కానరావడం లేవు.
తగ్గిన సాగు విస్తీర్ణం
సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ఈ ప్రభావం తీవ్రంగా పడింది. వాస్తవంగా ఈపాటికి హైదరాబాద్ మలక్‌పేట మార్కెట్‌లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజారత్ ఉల్లి పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కానీ,గత మూడేళ్లుగా ఉల్లి ధరకు డిమాండ్ లేని కారణంగా సాగు విస్తీర్ణం 60 శాతానికి తగ్గు ముఖం పట్టింది. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు సగం పంట దెబ్బతింది. దీంతో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి పాత ఉల్లిగడ్డ మాత్రమే మార్కెట్‌కు తరలి వస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజారత్‌లో ఉల్లి పంట రెండో దశలో ఉంది. చేతికి వచ్చేనాటికి సంక్రాంతి కావచ్చు. ఆ తర్వాత ఉల్లి లభ్యత మార్కెట్‌లో పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉల్లి తిప్పలు తప్పనట్లు తెలుస్తోంది.